తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కిషన్ రెడ్డి ట్వీట్

  • ఇంధన సరఫరాకు ఎలాంటి కొరత లేదన్న కిషన్ రెడ్డి
  • కొరత భయాలతో పెట్రోల్ బంకులకు ప్రజలు క్యూ కట్టవద్దని విజ్ఞప్తి
  • నిన్న పెట్రోల్ వినియోగం రోజువారి సగటుతో రెండింతలు, డీజిల్ రెండున్నర రెట్లు పెరిగినట్లు వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత భయాలతో హైదరాబాద్ నగరం సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొరత లేదని ప్రకటించింది. తాజాగా, కిషన్ రెడ్డి కూడా ఆందోళన అవసరం లేదని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

అంతేకాదు, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఎలా పెరుగుతుందో గణాంకాలు పేర్కొన్నారు. పెట్రోల్ రోజువారి సాధారణ సగటు 6,920 కిలోలీటర్లుగా ఉండగా, నిన్న ఒక్కరోజే 12,875 కిలోలీటర్లు సరఫరా జరిగిందని తెలిపారు. డీజిల్ సాధారణ సగటు 9,017 కిలోలీటర్లు కాగా, నిన్న 21,295 కిలోలీటర్ల పంపిణీ జరిగినట్లు వెల్లడించారు.

డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అందుకే సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. పుకార్లు నమ్మి పెట్రోల్ బంకుల వద్దకు వచ్చి అనవసరంగా క్యూ కట్టవద్దని పేర్కొన్నారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ప్రజలకు కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Kishan reddy on Petrol and Diesel shortage
Petrol and Diesel shortage

More Telugu News